మా గురించి.....

         కలియుగం ఆరంభమైన నాటినుంచి భవిష్యత్తును తెలుసుకునే నేపథ్యంలో సాముద్రిక శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం అనంతరం భవిష్యత్తును తెలిపే వివిధ శాస్త్రాలూ పుట్టుకొచ్చాయి.

         ఇదిలా ఉంటే, పూర్వం మునులు దివ్యదృష్టితో భవిష్యత్తును చెప్పేవారని పురాణాల ద్వారా తెలుస్తోంది. భవిష్యత్తు తెలుసుకొనే నేపధ్యంలో కొన్ని శాస్త్రాలు యిలా పుట్టుకొస్తే, కొంతమంది మహనీయులు తమ దివ్యదృష్టి, భగవదనుగ్రహం కారణంగా ఏకంగా కాలజ్ఞానాన్నే రాసేశారు. అలాంటి వారిలో నారదులు, వ్యాసులు, మార్కండేయులు, శుకలు, బసవన్న, వేమన్న, రెట్టమతంవారు, శంకరాచార్యులు, విద్యారణ్యులు, వీరంబట్టయ్య, సర్వజ్ఞుడు, భానుమండలంవారు, కాశి బాలబ్రహ్మేశ్వరుడు, శంతనయోగి, శీలంపాటి గుండాబోట్లు, పసురుపాటి రామిరెడ్డి, చెన్నంపల్లె చెన్నారెడ్డి, కోనూరి ఓబళయ్య, పార్లపల్లె పాపరాజు, అన్నమయ్య, కడమళ్ళ కాలువ కాచిబోట్లు, భల్లపురం భోగీశ్వరయ్య, నారాయణముని, కృష్ణమాచార్యులు, వెర్రి గోవిందప్ప, మీనప్పయ్య, కంఠస్థళం నాగలింగం, కరి వీరన్న, దిద్దుకూరి నాగప్ప తదితర పుణ్యపురుషులు ఎందరో భవిష్యత్తును చెప్పినట్లుగా ఆధారాలు ఉన్నాయి. వీరందరిలో అగ్రగణ్యులు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారు. సాంద్రసింధు వేదమనే కాలజ్ఞానంద్వారా మానవాళికి చేసిన సేవ అనంతమైనది.

         పదిహేడవ (17) శతాబ్దంలోనే శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాములవారు తన కాలజ్ఞాన విశేషాలను లోకానికి అందిస్తే, పదిహేనవ (15) శతాబ్దంలోనే ఫ్రెంచిద్రష్ట 'నోష్ట్రడామస్' తన ప్రోపసీస్ ద్వారా ప్రపంచ భవిష్యత్తును మానవాళికి అందించారు. అటు తర్వాత కీరో, అన్వారీ, ఈబెన్ ఖాసీ, మాలఖీ- తదితర జ్యోతిష్య శాస్త్రజ్ఞులు, ప్రపంచ భవిష్యత్తును మానవాళికి అందించారు. ఆ మహనీయుల నిష్కపట సేవా ఫలితమే ఈనాడు, కాలజ్ఞాన రూపంలో మన ముందున్నది.

          భవిష్యత్తును తెలుసుకోవడమంటే వినాశనాన్ని తెలుసుకోవడం కాదు. వినాశనం కల్గకుండా ఉండటానికి మనమెలాంటి కృషి చేయాలో తెలియచేయడానికే ఆ మహనీయులు భవిష్యత్తును కాలజ్ఞానం రూపంలో మనకందించారు.

         చెడు చేసినవారికి కూడా మంచి చేయడం సత్ పురుషుల నైజం. కనుక మంచిని పెంచి, మానవ సేవలో ముందుకి నడచినప్పుడే, మహనీయుల మనోభావాలకు ఓ అర్థమూ, పరమార్థమూ లభిస్తాయి. కనుక భవిష్యత్ సంఘటనలు తెలిపేదే ఈ మా "కాలజ్ఞాని". శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారు భవిష్యత్ కోసం ఏం చెప్పారో తెలియచేయడానికే ఈ చిన్న ప్రయత్నం. ఈ మా ప్రయత్నం వమ్ముకాదని ఆశిస్తున్నాం.

         శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాములవారి భక్తుల కోసం, భక్తులచే లాభాపేక్ష లేకుండా నిస్వార్థముతో శ్రీ స్వాములవారి ఆలోచన విధానాన్ని, భోధనలను, జీవిత చరిత్రను, ఆశయాలను సమస్త ప్రజానీకమునకు తెలియజేయాలనే సంకల్పముతో ఈ "కాలజ్ఞాని" వెబ్ సైట్ ప్రారంబించినాము. మీ నుండి లభించే సహాయ సహకారాలతోపాటు, సలహాలు, సూచనలు, మార్పులు మరియు చేర్పులు తదితరములకు సదా కృతజ్ఞులమని తెలియజేస్తున్నాము. అలాగే కందిమల్లాయపల్లెలోని మఠం యాజమాన్యమునకు ఈ వెబ్ సైట్ కు ఏ విధమైన సంబంధం లేదని మనవి చేస్తున్నాము

Brahmamgari Mattam View Latest